ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీసు.

TG 5,సంగారెడ్డి ప్రతినిధి
డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో యం.ఎన్.ఆర్ మెడికల్ కళాశాలలో మహిళల భద్రత, బాలల రక్షణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ.

• ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపిఎస్ పాల్గొన్నారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు (29.04.2026) సంగారెడ్డి యం.ఎన్.ఆర్ మెడికల్ కళాశాలలో జిల్లా పోలీసు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో మహిళల భద్రత, బాలల రక్షణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్ బృందాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. బాధిత మహిళలకు సఖీ కేంద్రం, భరోసా కేంద్రాలు అండగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యాసంస్థలు, పని ప్రదేశాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112, 1930, 1098 లేదా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656772 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మౌనం వీడి నిర్భయంగా ముందుకు వచ్చినప్పుడే సమస్యలకు న్యాయం జరిగి, ఇతరులకు అలాంటి ఘటనలు జరగకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.

పోక్సో కేసులను తీవ్రంగా పరిగణిస్తూ నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయబడుతున్నాయని తెలిపారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం, కేసుకు సంబంధించిన సమాచారాన్ని అందించని వారు కూడా శిక్షార్హులవుతారని హెచ్చరించారు.

సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, విద్యావంతులే ఎక్కువగా ఈ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. అత్యాశకు లోనై సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని సూచించారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో గుర్తు తెలియని నంబర్ల నుండి కాల్స్ చేసి పోలీసులమని బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి లేదని, ఏ పోలీసు అధికారులు వీడియో కాల్స్ ద్వారా విచారణ చేయరని స్పష్టం చేశారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు మొదటి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని, వెంటనే 1930 కు కాల్ చేయడం లేదా NCRP పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువతకు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. మొదట సరదాగా ప్రారంభించిన ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి, యువత తమ జీవితంపై పట్టు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. చదువు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్ లక్ష్యాలను విస్మరించి మత్తులో కాలం గడుపుతున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలకు సంభందించిన సమాచారం ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా జిల్లా ఎస్-న్యాబ్ నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని సూచించారు.

యువత అనవసర అలవాట్లకు దూరంగా ఉండి, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి లలిత కుమారి, సిడబ్ల్యుసి సభ్యుడు వెంకటేశం, డిప్యూటీ డీఎం హెచ్ఓ నాగనిర్మల, కళాశాల ప్రిన్సిపల్ డా. శ్యామ్ కుమార్, చైల్డ్‌లైన్ ప్రతినిధి రత్నం, డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, క్రాంతి కుమార్, రవి, షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్, సిబ్బంది, భరోసా సిబ్బంది పాల్గొని మహిళల భద్రత, బాలల రక్షణపై అవగాహన కల్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు