మహారాష్ట్రలోని ఠాణే జిల్లా కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో అత్యంత అమానవీయ ఘటన వెలుగుచూసింది. రక్షణగా ఉండాల్సిన రైల్వే స్టేషన్ ఆవరణలోనే ఒక 14 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు దుర్మార్గులు కామాంధులుగా మారి అత్యాచారానికి ఒడిగట్టారు. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఒంటరిగా ఉన్న సమయంలో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలైన బాలిక తన కుటుంబ సభ్యులతో గొడవపడి, కోపంతో ఇల్లు వదిలి కల్యాణ్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. రాత్రి సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న బాలికను గమనించిన ఇద్దరు నిందితులు ఆమెకు సహాయం చేస్తామని నమ్మించారు. ఆపై ఆమెను స్టేషన్ వెనుక వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి బలవంతంగా లాక్కెళ్లి, ఒకరి తర్వాత ఒకరు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘోరంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్యాణ్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) స్టేషన్‌లో గ్యాంగ్ రేప్ కేసుతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రస్తుతం ఆమెకు కౌన్సిలింగ్ అందిస్తున్నారు.








