మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గుండెలవైసే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ధనివారీ ప్రాంతంలో పెళ్లి బృందంతో (నిశ్చితార్థ వేడుకకు) వెళ్తున్న ఒక చిన్న ట్రక్కును, వేగంగా వచ్చిన భారీ కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాపుగావ్ గ్రామానికి చెందిన సుమారు 40 మందికి పైగా బంధువులు ఒక ఐషర్ ట్రక్కులో నిశ్చితార్థ వేడుక కోసం ధనివారీకి బయలుదేరారు. పెళ్లికూతురు ఇంటికి చేరుకోవడానికి కొద్ది దూరంలో ఉండగా, వన్‌వేలో వస్తున్న ట్రక్కును ముంబై వైపు నుండి వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘర్షణ ఎంత తీవ్రంగా ఉందంటే, కంటైనర్ ముందు భాగం ఊడి నేరుగా పెళ్లి బృందం ట్రక్కుపై పడింది. ఈ క్రమంలో ఒక మోటార్ సైకిల్ కూడా వాహనాల కింద నలిగిపోయి ఇద్దరు బైకర్లు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని కాసా సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో పెళ్లి ఇంట తీవ్ర ఘోష నెలకొంది.








