కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును మరింత వేగవంతం చేస్తూ, తాజాగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో ఈ కొత్త సిట్ పనిచేయనుంది. ఇప్పటికే ఈ ప్రధాన కేసుపై ఒక సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతుండగా, సోషల్ మీడియాలో చోటుచేసుకున్న కొన్ని అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ రెండో సిట్‌ను రంగంలోకి దించింది.
ఈ కొత్త సిట్ ఏర్పాటుకు ప్రధాన కారణం.. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న తెలంగాణ హైకోర్టు మహిళా జడ్జిని ఉద్దేశించి సోషల్ మీడియాలో కొందరు తీవ్రమైన అనుచిత పోస్టులు, ట్రోలింగ్స్ చేయడమే. బండి భగీరథ్‌కు గనుక బెయిల్ మంజూరు చేస్తే, సదరు జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం తప్పుడు ప్రచారం నిర్వహించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా, జడ్జిపై వ్యక్తిగత దూషణలకు దిగిన ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ట్రోలింగ్స్‌కు కారణమైన ప్రధాన నిందితుడు దామోదర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారిని పట్టుకునే బాధ్యతను ఈ కొత్త సిట్‌కు అప్పగించారు.
మరోవైపు, బాధితురాలైన మైనర్ బాలిక గుర్తింపును చట్టవిరుద్ధంగా సోషల్ మీడియాలో వెల్లడించడంపై కూడా ఈ సిట్ ఫోకస్ పెట్టనుంది. పోక్సో చట్టం నిబంధనల ప్రకారం బాధిత బాలిక ఫోటోలు, పేరు లేదా కుటుంబ వివరాలను బయటపెట్టడం తీవ్రమైన నేరం కాబట్టి, ఆ వివరాలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. కాగా, ప్రధాన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి, మే 29 వరకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం పోలీసులు భగీరథ్ స్నేహితులను కూడా పిలిపించి విచారణ జరుపుతున్నారు.









