పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసులో సంచలనం: అసలు నిజాలు తేల్చేసిన పోలీసులు!

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో “భరోసా” పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ ధార అభినయ్ దర్శన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనలో పోలీసులు ఊహించని నిజాలను వెలుగులోకి తెచ్చారు. చింతపల్లి మండలం నీరుతోటపాలెం సమీపంలో ముసుగులు ధరించిన దుండగులు తన కారును అడ్డుకుని, మత ప్రచారం చేస్తున్నావంటూ గుడ్లు, కత్తులతో ఘోరంగా దాడి చేశారని ప్రచారం జరిగింది. అయితే, ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే లోతుగా దర్యాప్తు జరిపి, ఈ దాడి వెనుక ఉన్న అసలు ట్విస్ట్‌ను బట్టబయలు చేసింది.

పోలీసుల అధికారిక దర్యాప్తు ప్రకారం.. ఈ దాడి ఘటన ఒక పెద్ద ప్లాన్డ్ డ్రామా (కల్పిత కథ) అని తేలింది. పాస్టర్ అభినయ్ దర్శన్ ప్రజా సానుభూతి, రాజకీయ పబ్లిసిటీ కోసమే తన అనుచరులతో కలిసి ఈ నాటకానికి తెరతీసినట్లు పక్కా ఆధారాలతో నిరూపితమైంది. నిందితుల్లో ఒకరి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఆడియోలు, వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు సేకరించారు. ఎక్కడ దాడి చేయాలి, కారుపై ఎలా అటాక్ చేసి సీన్ క్రియేట్ చేయాలి అనే విషయాలపై వారు ముందుగానే మాట్లాడుకున్న ఆడియో సంభాషణలు దొరకడంతో నిందితుల గుట్టు పూర్తిగా రట్టయింది. వైద్యాధికారుల నివేదికలో కూడా ఆయనకు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని తేలింది.

మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాస్టర్ అభినయ్ దర్శన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల దర్యాప్తుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటన తరహాలోనే తనను కూడా అంతమొందించడానికి పెద్ద కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. పోలీసులు తనపై తానే దాడి చేయించుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ “డబుల్ గేమ్” ఆడుతున్నారని, అసలైన నిందితులను వదిలేసి తన అనుచరులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తుండగా, మతాల మధ్య వైషమ్యాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కల్పిత దాడుల డ్రామాలకు తెరతీసిన పాస్టర్ బృందంపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు