• పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి విద్యా ప్రగతికి తోడ్పడాలనే ఉద్దేశ్యంతో “స్పార్క్” కార్యక్రమం నిర్వహణ..
• మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు, ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఐపీఎస్.
TG 5,సంగారెడ్డి ప్రతినిధి: పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి విద్యా ప్రగతికి తోడ్పడాలనే ఉద్దేశ్యంతో తేది: 16.05.2026 న సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో “స్పార్క్” కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ముందుగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంగారెడ్డి జిల్లా విద్యార్థులందరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి విద్యా ప్రగతికి తోడ్పడాలనే లక్ష్యంతో “స్పార్క్-(సపోర్టింగ్ పొటెన్షియల్ అకడమిక్ రైజ్ ఫర్ ఖాకీ కిడ్స్)” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
“స్పార్క్” అనేది చిన్న నిప్పురవ్వ లాంటిదని, దానిని సక్రమంగా ఉపయోగిస్తే వెలుగుని, ఉపయోగాన్ని ఇస్తుందని అన్నారు. అదే నిర్లక్ష్యం చేస్తే పెద్ద అగ్నిలా మారి నియంత్రణకు అందకుండా పోవచ్చని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే పిల్లల్లో ఉన్న ప్రతిభను సరైన దిశలో ప్రోత్సహిస్తే వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.
పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితంలో ఎంతో కీలకమైన దశ అని, ఈ సమయంలో విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. అదే చెడు అలవాట్లకు బానిసలైతే జీవితంలో ముందుకు సాగడం కష్టమవుతుందని తెలిపారు.
సెల్‌ఫోన్‌ను పిల్లలు మంచి పనుల కోసమే వినియోగిస్తున్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. అలాగే పిల్లలను మరీ కఠినంగా గానీ, అతిగా గారాబంగా గానీ పెంచకుండా సమతుల్య విధానంలో పెంచాలని సూచించారు.
90కి పైగా శాతం మార్కులు సాధించడం సాధారణ విషయం కాదని, అది విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థులు ఇదే పట్టుదలతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనంతరం అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ “స్పార్క్” కార్యక్రమం ద్వారా పోలీసు కుటుంబాల పిల్లల్లో విద్యాపట్ల మరింత ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాల్లో కూడా ముందుండాలని అన్నారు.
కష్టపడే తత్వాన్ని నమ్మినవారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, ప్రతి విద్యార్థి పెద్ద కలలు కనాలని, ఆ కలలను నిజం చేసుకునేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. విజయం ఒక్క రోజులో రాదని, నిరంతర కృషి, సమయపాలన, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి అండగా నిలిచిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.
మీ తల్లిదండ్రులు (పోలీసులు) మీకు సరైన సమయం ఇవ్వలేకపోవచ్చని, ముఖ్యంగా పండుగలు, ఇతర ఉత్సవాల సమయంలో వారు రాత్రింబవళ్లు విధులు నిర్వహించడం వల్లనే ప్రజలు ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నారని, అందుకు కారణం మీ తల్లిదండ్రులేనని గుర్తించాలని అన్నారు. మీ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి, ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిటిసి అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, సైదా నాయక్, ఆర్డీఎస్పీ నరేందర్, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు సురేష్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.









