తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు భానుడి భగభగలు కొనసాగుతుండగానే, మరోవైపు వాతావరణ శాఖ (IMD) తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిన తరహాలోనే, గంటకు 40 నుండి 70 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండుటెండల మధ్య ఒక్కసారిగా ఈ స్థాయిలో గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనుండటంతో ప్రజలు “తస్మాత్ జాగ్రత్త” అంటూ అలర్ట్ ప్రకటించారు.
తెలంగాణలో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాల్లో వాతావరణం అతలాకుతలం కానుంది. మరోవైపు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు (హీట్‌వేవ్) వీస్తుండగానే, హఠాత్తుగా బలమైన ఉపరితల ఆవర్తన గాలులు తోడవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా పిడుగులతో కూడిన ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకి, వేగంగా కేరళ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ ముందస్తు తుఫాను తరహా గాలులు ఏర్పడుతున్నాయి. ఈ భారీ ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు కూలిపోయే ప్రమాదం ఉందని, పొలాల్లో ఉన్న రైతులు, ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద గానీ, ఇనుప స్తంభాల పక్కన గానీ నిలబడవద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.









