ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు అలీ తాజాగా నటించిన ‘ఘర్ సోప్’ వాణిజ్య ప్రకటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ యాడ్‌లో ఒక సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తూ, నేపథ్యంగా హిందూ మంత్రాలు పఠించడం పలువురిని తీవ్రంగా కలచివేసింది. ఒక సబ్బుకు దేవతలా పూజలు చేయడం, పవిత్ర మంత్రాలను కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం హిందూ మత విశ్వాసాలను అవహేళన చేయడమేనంటూ వివిధ సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలీని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో నటుడు అలీ తక్షణమే స్పందిస్తూ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ముంబైకి చెందిన సదరు సంస్థ తనను ఈ యాడ్ కోసం సంప్రదించిందని, గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో తాను చేసిన ఒక కామెడీ సీన్ (ఇస్త్రీ పెట్టెకు పూజ చేసే దృశ్యం) ఆధారంగా ఈ యాడ్‌ను రూపొందించారని ఆయన తెలిపారు. అయితే, కేవలం ఆ నాటి కామెడీని వాణిజ్య ప్రకటనలో వాడటం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని తనకు అర్థమైందని, ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని అలీ స్పష్టం చేశారు.
ఈ యాడ్ చూసిన వెంటనే తన స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని తనకు సూచించడంతో వెంటనే సదరు సంస్థతో మాట్లాడి, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆ యాడ్‌ను పూర్తిగా డిలీట్ చేయించినట్లు అలీ వెల్లడించారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని ఆయన కోరారు. అలీ క్షమాపణలతో ఆయన వరకు వివాదం సద్దుమణిగినప్పటికీ, సున్నితమైన మతపరమైన అంశాలను వ్యాపార లాభాల కోసం వాడుకున్నందుకు గాను సదరు ఘర్ సోప్ కంపెనీపై మాత్రం ప్రజల నుంచి ఇంకా ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది.









