గాయత్రి మాత దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్ లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల సుధాకర్, జనరల్ సెక్రెటరీ నందకుమార్ జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైశాఖ బహుళ దశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు ఏకకంఠంతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో ఆలయ పరిసర ప్రాంతమంతా భక్తిమయ వాతావరణంతో మార్మోగింది. అనంతరం అర్చకులు స్వామివారికి మంగళహారతులు సమర్పించి, భక్తులకు సింధూర తిలకం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









