చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా స్థాయి ఉచిత వైద్య శిబిరం మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఘనంగా నిర్వహించబడింది. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరంతరం శ్రమిస్తూ పద్మశాలి వృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికులు వృత్తి రీత్యా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి కోసం ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, నాలుగో వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేశు, పద్మశాలి సంఘం నాయకులు విడం వెంకటేశం మరియు వంగరి రఘు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్తిపల్లి యాదయ్య, అందే యాదయ్య, ఉప్పల రాజయ్య, గునిగంటి రాజు గౌడ్, బద్దుల మురళి యాదవ్, బానోతు కిరణ్ నాయక్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.శిబిరానికి వచ్చిన కార్మికులకు వైద్య సిబ్బంది వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వృత్తి రీత్యా వచ్చే వెన్నునొప్పి, కంటి సమస్యలు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల పట్ల కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలు అందించారు.









