జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? కటకటాల వెనుక ఖైదీలు పడే కష్టాన్ని, వారి దినచర్యను ప్రత్యక్షంగా అనుభూతి చెందాలనుకుంటున్నారా? అయితే ఎలాంటి నేరం చేయకుండానే జైలుకు వెళ్లే వినూత్న అవకాశాన్ని జైళ్ల శాఖ కల్పిస్తోంది. ‘ఫీల్ ది జైల్’ (Feel the Jail) అనే వినూత్న కాన్సెప్ట్ ద్వారా సాధారణ పౌరులు కూడా కేవలం రూ. 500 చెల్లించి 24 గంటల పాటు జైలు జీవితాన్ని గడిపేలా అధికారులు ఈ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
ఈ కాన్సెప్ట్ కింద వెళ్లిన వారికి అచ్చం ఖైదీల్లాగే ట్రీట్మెంట్ ఉంటుంది. లోపలికి వెళ్లగానే సాధారణ దుస్తులు తీసేసి ఖైదీలు ధరించే జైలు యూనిఫాం వేసుకోవాల్సి ఉంటుంది. నిద్రించడానికి ఒక చాప, దుప్పటి, సబ్బు మాత్రమే ఇస్తారు. మొబైల్ ఫోన్లు, బయటి ఆహార పదార్థాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నిషేధం. ఇక భోజనం విషయానికి వస్తే.. ఉదయం టీ, టిఫిన్ నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకు అన్నీ జైలు మెనూ ప్రకారమే ఇతర ఖైదీలు తినే ఆహారాన్నే తినాల్సి ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవడం మొదలుకొని జైలు అధికారులు విధించే కఠినమైన నియమ నిబంధనలు, టైమ్ టేబుల్ వీరికి కూడా కచ్చితంగా వర్తిస్తాయి.
జైలు జీవితం అనేది సినిమాల్లో చూపించినంత సులభం కాదని, స్వేచ్ఛను కోల్పోయి నాలుగు గోడల మధ్య బతకడం ఎంత కఠినంగా ఉంటుందో ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్షణికావేశంలో నేరాలు చేసి జైలు పాలైతే జీవితం ఎలా మారిపోతుందో స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే.. భవిష్యత్తులో వారు తప్పుల వైపు వెళ్లకుండా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. నేరాల నియంత్రణపై అవగాహన కల్పించడంతో పాటు, జైలు వాతావరణంపై సామాన్యులలో ఉన్న ఆసక్తిని, అపోహలను తొలగించడానికి ఈ వినూత్న ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు.









