TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులు, లైంగిక వేధింపులకు పాల్పడిన బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుని బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదైన తర్వాత కూడా 48 గంటలు గడిచినా అరెస్ట్ చేయకపోవడం దారుణమని నాయకులు విమర్శించారు. బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ అంశాలను కూడా కేసులో భాగంగా చేర్చాలని కోరారు. బాధితురాలికి మరియు ఆమె కుటుంబానికి తక్షణ రక్షణ కల్పించి, ఆమెతో వెంటనే మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ నమోదు చేయించాలని డిమాండ్ చేశారు.
అలాగే, బాధితురాలు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినప్పుడు గంటల తరబడి వేచి చూసేలా చేసి కేవలం అక్‌నాలెడ్జ్‌మెంట్ ఇచ్చి పంపించిన పేట్ బషీరాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో BRSV నియోజకవర్గ అధ్యక్షుడు పెద్దగొల్ల శ్రీహరి, జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్, రాష్ట్ర కార్యదర్శి మన్సూర్ నాయక్, పట్టణ, మండల యువత అధ్యక్షులు వాజిత్, నాని, నరేష్ గౌడ్, నాయకులు శ్రవణ్ రెడ్డి, సదాశివపేట మైనారిటీ అధ్యక్షులు కమిల్, BRSV పట్టణ, మండల అధ్యక్షులు పాండు నాయక్, రోషన్, అఖిల్, రమేశ్, దిలీప్, గౌతమ్, చింటూ, సంగమేశ్ తదితరులు పాల్గొన్నారు.









