మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు ఆనుకుని ఉన్న శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అర్థరాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది.
గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదును అపహరించాడు. ఈ ఘటన ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో దొంగ కదలికలు స్పష్టంగా బయటపడ్డాయి.
సీసీటీవీ ఫుటేజీలో దొంగ హుండీని పగులగొట్టి నగదు తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడకు ఆనుకుని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం రెండు ఆలయాలు ఉన్నాయి.
పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలో ఉన్న ఆలయంలోనే చోరీ జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
పోలీస్ స్టేషన్ పక్కనే చోరీ జరిగితే సాధారణ ప్రజల భద్రత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత కొంతకాలంగా మేడిపల్లి పీఎస్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనతో ప్రజల్లో భద్రతపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ఆలయ నిర్వాహకులు దేవాలయాల వద్ద రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని పోలీసులను కోరుతున్నారు.









