- నల్గొండలో భారీ నాకాబందీ
- పలువురిపై కేసులు నమోదు.. వాహనాల సీజ్.
నల్లగొండ: రిపోర్టర్ – నవీన్ కుమార్.Ch – TG5 News
నల్గొండ పట్టణంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ IPS ఆదేశాల మేరకు, నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి సూచనలతో నల్గొండ 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
నల్గొండ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు గోపాల్ రావు, కె. సతీష్, ఎన్. వెంకట్ నారాయణ, బి. లచ్చిరెడ్డి తదితరులు సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ప్రత్యేక నాకాబందీ ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగింది.
తనిఖీల్లో సరైన పత్రాలు లేని 28 వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోగా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన 48 మందికి జరిమానాలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 4 మందిపై కేసులు నమోదు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని 5 వాహనాలను సీజ్ చేయడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 24 మందిపై ఈ-పెట్టి కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. టూ టౌన్ ఎస్ఐలు సైదులు షరీఫ్, మునుగోడు ఎస్ఐ రవి, చండూరు ఎస్ఐ శివలతో కలిసి పబ్లిక్ ప్రదేశాలు, పార్కులు మరియు బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నవారిని, సిగరెట్లు తాగుతున్నవారిని, ఆకతాయిగా తిరుగుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ఈ-చలాన్లు జారీ చేసి జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ కోసం ఇటువంటి నాకాబందీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాల పత్రాలు వెంట ఉంచుకోవాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పార్కుల్లో ఆకతాయిలుగా తిరగడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.









