పోక్సో, అత్యాచార కేసులలో మహిళలు, బాలికల భద్రతకు “భరోసా” పెద్దపీట.

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా.

పత్రిక ప్రకటన తేది: 07.05.2026,

• పోక్సో, అత్యాచార కేసులలో మహిళలు, బాలికల భద్రతకు “భరోసా” పెద్దపీట.

• భరోసా సెంటర్, సిబ్బంది సేవలు అభినందనీయం: జిల్లా ఎస్పీ

• భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా భరోసా కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్.

TG 5,సంగారెడ్డి ప్రతినిధి: తేది: 07.05.2026 భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., అదనపు ఎస్పీ శ్రీ చైతన్య రెడ్డి, ఐపీఎస్. హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాల నేపథ్యంలో వర్మ కమిటీ సిఫార్సుల ఆధారంగా, నిర్భయ ఘటన అనంతరం పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 2016 మే 7వ తేదీన ఆనాటి ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ స్వాతి లక్రా, ఐపీఎస్. ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

గత 10 సంవత్సరాలుగా పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలు, బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఫిర్యాదు నమోదు నుండి న్యాయస్థానంలో తుది తీర్పు వెలువడే వరకు మెడికో-లీగల్ సేవలు సహా అన్ని రకాల సేవలను ఒకే గొడుగు కింద అందిస్తూ, బాధిత మహిళల, ప్రజల మన్ననలు పొందుతూ తెలంగాణ భరోసా సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎస్పీ గారు పేర్కొన్నారు.

ప్రస్తుత ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ చారుసిన్హా ఐపిఎస్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్‌లో శిక్షణ పొందిన సిబ్బంది బాధిత మహిళలను అక్కున చేర్చుకొని వారిలో ధైర్యాన్ని నింపుతూ, సమస్యలతో వచ్చిన వారికి నిష్ణాతులైన భరోసా సిబ్బందిచే కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు మెడికల్, లీగల్, కాంపెన్సేషన్ తదితర సేవలను ఒకే వేదికపై అందిస్తూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సేవలందిస్తున్నారని సిబ్బంది సేవలను కొనియాడారు.

అనంతరం అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార కేసులలో బాధితులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, చిన్న సమాచారం అందిన వెంటనే భరోసా సెంటర్ సిబ్బంది మీ చెంతకు చేరుకుని అన్ని రకాల సేవలను అందిస్తారని తెలిపారు. పోక్సో, మహిళలపై నేరాలను నియంత్రించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మీకు జరిగిన అన్యాయం గురించి నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు నమోదు చేయాలని, న్యాయస్థానం ముందు దోషులకు శిక్ష పడినప్పుడే తిరిగి నేరాలకు పాల్పడేందుకు వెనకడుగు వేస్తారని అన్నారు.

సంగారెడ్డి జిల్లా భరోసా సేవలు:

• పోక్సో కేసులు – 688

• అత్యాచార కేసులు – 85

• కిడ్నాప్ కేసులు – 162

• మొత్తం కేసులు – 935

• నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు – 175

• హోమ్ విజిట్స్ – 249

• వైద్య పరీక్షలు – 531

• మిషన్ వాత్సల్య స్కాలర్‌షిప్ ద్వారా 24 మంది లబ్ధిదారులకు రూ. 6,40,000/- అందజేయడం జరిగింది.

• పరిహారం పొందిన మొత్తం బాధితులు – 468 మంది

• మొత్తం పరిహారం – రూ. 1,83,42,500/-

ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పూలబాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు