పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పొరుగు దేశం బంగ్లాదేశ్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, ఆ దేశ పార్లమెంటులో నేషనల్ సిటిజన్స్ పార్టీ ఎంపీ అక్తర్ హోస్సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బీజేపీ గెలిస్తే లక్షలాది మంది అక్రమ వలసదారులను తిరిగి తమ దేశానికి పంపేస్తారని, దీనివల్ల బంగ్లాదేశ్లో భారీ శరణార్థుల సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అగ్రనేతలు చొరబాటుదారులను బెంగాల్ నుంచి తరిమివేస్తామని పదేపదే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఎంపీ అక్తర్ హోస్సేన్ మాట్లాడుతూ.. “బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బంగ్లాదేశీయుల బహిష్కరణ ప్రక్రియ మొదలవుతుంది. దీనిపై మనం ఐక్యంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. వోట్వైబ్ వంటి సంస్థల అంచనాల ప్రకారం తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం ఉందని వార్తలు రావడంతో బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో గుబులు మొదలైంది.
ఈ పరిణామంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఘాటుగా స్పందించారు. బంగ్లాదేశ్ ఎంపీ ప్రసంగాన్ని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వెనుక ఉన్న అసలు శక్తులు ఇప్పుడు నెమ్మదిగా బయటకు వస్తున్నాయని విమర్శించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తన ఓటు బ్యాంకు కోసం అక్రమ వలసదారులకు మద్దతు ఇస్తోందని బీజేపీ ఆరోపిస్తుండగా, చొరబాట్ల విషయంలో కేంద్రమే నిష్క్రియాత్మకంగా ఉందని టీఎంసీ ఎదురుదాడి చేస్తోంది. తాజా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇరు దేశాల సరిహద్దు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.








