TG 5, సంగారెడ్డి ప్రతినిధి
. స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ ఆయనతో కలిసి పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
శనగ పంటను తెచ్చి నెలరోజులు అయినా ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా సక్రమంగా అందడం లేదని, అన్ని పంటలు కొంటామని చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతు బంధు అందించామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఏ పంట కూడా సక్రమంగా కొనుగోలు చేయడం లేదని, 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ప్రారంభం కాలేదన్నారు.
ధాన్యం దళారుల పాలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సివిల్ సప్లై కార్పొరేషన్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అందుకే కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు.
సీఎం, మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించలేదని ప్రశ్నించిన కేటీఆర్, సీఎంకి భూముల కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్‌పై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో వడదెబ్బ, పిడుగులు, హార్ట్ స్ట్రోక్‌లతో రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ రాసిన లేఖతో ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
రాబోయే వారం రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతులకు ధైర్యం చెబుతామని, అవసరమైతే తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవసరమైతే ఉక్కిరిబిక్కిరి చేస్తామని హెచ్చరించారు.









