వేసవిలో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ కీలక సూచనలు

• ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ – రైతులు అప్రమత్తంగా ఉండాలి.
• గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాల దగ్గర అత్యవసర నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలి.
• వేసవిలో చెరువులు, కుంటల వద్ద ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి.
• ఈతకు వెళ్లేటప్పుడు అప్రమత్తత అవసరం – నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారి తీస్తుంది.
• అప్రమత్తతే ప్రాణ రక్షణ – ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ మీతోనే సంగారెడ్డి జిల్లా పోలీసు..
• వేసవికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్

TG 5,సంగారెడ్డి ప్రతినిధి:

ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల వద్ద గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాలు ఉన్న ప్రాంతాల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని అన్నారు. రైతులు తమ పొలాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, గడ్డి వాములు మరియు పొలాల సమీపంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎండిన గడ్డి దగ్గర మంటలు వేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఇళ్ల వద్ద వంటలు చేసి, పొయ్యిని పూర్తిగా ఆర్పకుండా పనులకు వెళ్లడం వల్ల గాలికి మళ్లీ మంటలు చెలరేగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.

ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళలలో ఇళ్ల బయట లేదా మేడలపై నిద్రించే పరిస్థితులు ఉంటాయని, ఈ సమయంలో దొంగలు అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వేసవి కాలంలో చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా యువత మరియు చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని, ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే వెళ్లాలని, లోతు తెలియని ప్రాంతాల్లో ఈతకు వెళ్లడం చాలా ప్రమాదకరమని అన్నారు. మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం పూర్తిగా నిషేధమని, చెరువులు, కుంటల వద్ద నిర్లక్ష్యంగా ప్రవర్తించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే 100 లేదా 112 నంబర్లకు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 కు సమాచారం అందించాలని సూచించారు.

గత సంవత్సరం వేసవికాలంలో జిల్లా గణాంకాలు:
అగ్ని ప్రమాదాలు: 7
దొంగతనాలు: 50
చెరువుల వద్ద ప్రమాదాలు: 23

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు