TG5, సంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణ, అవగాహన పై ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 దేశాలలో చేపట్టిన ‘వరల్డ్ లార్జెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్ రన్’ కోసం చేపట్టిన అవేర్నెస్ రన్ కార్యక్రమం గురించి నిర్వాహకులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్ రన్ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆవిష్కరించారు. ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్’ ను హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ నెల 11వ తేదీ 2026 న ఘనంగా నిర్వహించబోతున్నట్లు మంత్రికి నిర్వాహకులు వివరించారు. గత సంవత్సరం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ లో సుమారు 35 వేల మంది, 130 దేశాలలో సుమారు 3 లక్షల మందికి పైగా క్యాన్సర్ అవేర్నెస్ రన్ లో పాల్గొన్నారని మంత్రికి తెలియజేశారు. గ్రేసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్ పై చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాన్సర్ నివారణ, అవగాహన కార్యక్రమాల గురించి వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి అనుమానితులకు స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ లను, కీమోథెరపీ సేవలను అందుబాటులో ఉంచామన్నారు. క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్నామన్నారు. క్యాన్సర్ చికిత్సలకు ఎం.ఎన్.జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, నిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, యశోద ఆస్పత్రి ప్రతినిధి డా. సాయి కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.









