వరంగల్ ఎన్టీవీఎం, ఏప్రిల్ 18: తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న మాటను నిజం చేస్తూ ఓరుగల్లు గడ్డపై మన వరంగల్ వాసి ఆలుపెరగని అంకితభావంతో అసాధారణ సాహసాన్ని నిరూపిస్తూ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. వెంకటేశ్వరులు గిన్నిస్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు.
“లాంగెస్ట్ కంటిన్యూయస్ ప్రోగ్రామింగ్ లెసన్” విభాగంలో ఆయన సృష్టించిన ఈ ఘనత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నైజీరియా దేశం రికార్డు బద్దలు కొట్టి భారత దేశ కీర్తిని మరింత పెంచారు.
గతంలో ఈ విభాగంలో భారత్ పేరిట ఉన్న 48 గంటల రికార్డును అధిగమిస్తూ, తదనంతరం నైజీరియా నెలకొల్పిన 62 గంటల రికార్డును కూడా వెంకటేశ్వరులు ఏకంగా 64 గంటల 12 నిమిషాల పాటు నిరవధికంగా బోధించి గిన్నిస్ బుక్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.
ఏప్రిల్ 12న ప్రారంభమైన ఈవెంటు ఏప్రిల్ 15న విజయవంతంగా ముగిసింది. విద్యార్థులకు అద్భుత ప్రసంగశైలి, విశ్లేషణాత్మక వివరణలతో పాటు పైథాన్, యూనిటెస్ట్, కృత్రిమ మేధస్సు వంటి అంశాలపై డాక్టర్ వెంకటేశ్వరులు కేవలం ఒక ప్రొఫెసర్ మాత్రమే కాదు, ప్రేరణామూర్తిగా నిలిచారు.
ఈ ఘనత సాధించిన వెంకటేశ్వరులను పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, సహచరులు ఘనంగా సన్మానించి అభినందించారు. వెంకటేశ్వరులు సాధించిన ఈ విజయంతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం నింపబడిందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.









