ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒకే వధువు కోసం ఇద్దరు వరులు పెళ్లి కొడుకులుగా వచ్చిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఖతౌలీ ప్రాంతానికి చెందిన ఒక వధువును వివాహం చేసుకునేందుకు మీరట్ మరియు షామ్లీ జిల్లాల నుండి ఇద్దరు వరులు తమ తమ ఊరేగింపులతో (బారాత్) తరలివచ్చారు. మండపం వద్దకు బ్యాండ్ బాజాలతో వచ్చిన ఇద్దరు పెళ్లికొడుకులను చూసి వధువు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమకే పెళ్లి నిశ్చయమైందని ఇరు పక్షాలు వాదించుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ గందరగోళానికి అసలు కారణం వధువు తల్లిదండ్రుల నిర్ణయమేనని తేలింది. మొదట ఒక వరుడితో పెళ్లి నిశ్చయించినా, కొన్ని గొడవల కారణంగా ఆ సంబంధం రద్దయిందని భావించిన తల్లిదండ్రులు హడావిడిగా మరో సంబంధం ఖాయం చేశారు. అయితే మొదటి వరుడు తనకు పెళ్లి రద్దు కాలేదని భావించి ముహూర్త సమయానికి ఊరేగింపుగా రావడంతో సమస్య మొదలైంది. ఒకవైపు రెండో వరుడు పెళ్లి పీటల మీద కూర్చోవడానికి సిద్ధమవుతుండగా, మొదటి వరుడు కూడా రావడంతో పెళ్లి మండపం కాస్తా పంచాయితీగా మారింది.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని ఆరా తీయగా మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆ వధువు మైనర్ అని, ఆమెకు పెళ్లి చేసే వయసు ఇంకా రాలేదని విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు తక్షణమే ఆ వివాహాన్ని నిలిపివేసి, నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇరు పక్షాలకు హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆ ఇద్దరు పెళ్లికొడుకులు పెళ్లి చేసుకోకుండానే ఖాళీ చేతులతో తమ ఇళ్లకు వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వింత పెళ్లి ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.








