అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణంలో అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై మంగళవారం (మే 19) జరపాల్సిన భారీ సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ట్రూత్ సోషల్ (Truth Social) వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి చర్చలకు సమయం ఇవ్వడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా ఈ దాడిని వెనక్కి తీసుకోవడం వెనుక మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) దేశాల దౌత్యం ప్రధాన పాత్ర పోషించింది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్‌లు ట్రంప్‌తో మాట్లాడి.. చర్చలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నందున దాడిని రెండు మూడు రోజులు వాయిదా వేయాలని కోరినట్లు సమాచారం. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించేలా ఒక ఆమోదయోగ్యమైన ఒప్పందానికి వచ్చేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు చేసిందని, అందుకే తాము ఈ అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే, ఈ వాయిదా కేవలం చర్చల కోసమేనని.. ఒకవేళ ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే ఏ క్షణంలోనైనా ఆ దేశంపై పూర్తి స్థాయి, భారీ ముట్టడికి సిద్ధంగా ఉండాలని అమెరికా సైనిక దళాలను ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియంను అప్పగించాలని, అణు కార్యక్రమాలను నిలిపివేయాలన్నది అమెరికా ప్రధాన డిమాండ్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక సడలింపులు ఉన్నప్పటికీ, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై నియంత్రణ మరియు అంతర్జాతీయ ఆంక్షల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.









