ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు రావడంతో ప్లేఆఫ్స్ రేస్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో పాటు గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పటికే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలింది కేవలం నాల్గవ స్థానం (ఒకే ఒక్క బెర్త్) మాత్రమే. ఈ చివరి స్థానం కోసం పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రేసులో నిలిచాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించాయి.
ఈ ఐదు జట్లలో రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేఆఫ్స్ చేరేందుకు మెరుగైన అవకాశాలు కలిగి ఉంది. 12 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ఉన్న రాజస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు (LSG, MIలతో) మిగిలి ఉన్నాయి. ఈ రెండింటిలో విజయం సాధిస్తే 16 పాయింట్లతో రాజస్థాన్ నేరుగా క్వాలిఫై అవుతుంది. మరోవైపు, ప్రస్తుతం 13 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) కు ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. లక్నోతో జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే 15 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే పంజాబ్ టాప్-4 లో నిలవాలంటే రాజస్థాన్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో కనీసం ఒకటైనా ఓడిపోవాల్సి ఉంటుంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు 12 పాయింట్లతో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 11 పాయింట్లతో రేసులో వెనుకబడి ఉన్నాయి. సీఎస్కే తన చివరి మ్యాచ్‌లో గుజరాత్‌పై భారీ విజయం సాధించడంతో పాటు, పంజాబ్, రాజస్థాన్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఓడిపోవాలని కోరుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా ఇంతే.. వారు కేకేఆర్‌పై గెలిచినా నెట్ రన్ రేట్ (-0.871) చాలా బలహీనంగా ఉండటం మైనస్ కానుంది. కేకేఆర్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే గరిష్టంగా 15 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇతర జట్ల గెలుపోటములపైనే పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో ఈ చివరి బెర్త్ ఎవరు దక్కించుకుంటారనేది క్రికెట్ అభిమానులలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.









