ప్రస్తుత రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు “ఎంతమంది పిల్లలుంటే అంత బలం” అనుకునేవారు, కానీ నేటి ఆర్థిక పరిస్థితులు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేశాయి. ఈ రోజుల్లో ఒక బిడ్డను పుట్టించి, ప్రయోజకుడిని చేయడానికే కనీసం 30 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. కార్పొరేట్ హాస్పిటల్స్ డెలివరీ ఛార్జీల నుండి మొదలుకొని.. డయాపర్లు, పౌడర్లు, కనీస అవసరాలకే వేలల్లో ఖర్చవుతుండటంతో సామాన్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక చదువుల విషయానికి వస్తే ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్లే స్కూల్ ఫీజులే లక్షల్లో ఉంటుండటంతో, ఇక ఉన్నత చదువుల నాటికి అయ్యే ఖర్చులను ఊహించుకుంటేనే తల్లిదండ్రులకు చెమటలు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం లేదా కొన్ని సంస్థలు మూడో బిడ్డ పుడితే 30 వేలు, నాలుగో బిడ్డ పుడితే 40 వేలు ఇస్తామంటూ ప్రకటించే ప్రోత్సాహకాలు నేటి ఖర్చుల ముందు ఎటు పోతాయో, దేనికి సరిపోతాయో అర్థం కాని పరిస్థితి. ఆ చిన్న మొత్తం పిల్లల ఒక్క నెల పాల ఖర్చులకు లేదా స్కూల్ వ్యాన్ ఫీజులకే సరిపోదని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
ఆర్థిక భద్రత, నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ధ్యేయంగా ఉన్న నేటి సమాజంలో “ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దు” అనే ధోరణి పెరిగిపోతోంది. ప్రభుత్వం జనాభాను పెంచేందుకు ఎన్ని ఆఫర్లు ప్రకటించినా.. ఆచరణలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే అవుతుంది. అందుకే, లక్షల రూపాయల ఖర్చులతో కూడుకున్న ఈ కాలంలో.. వేలల్లో ఇచ్చే అరకొర సాయాన్ని నమ్ముకుని ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనడం అంటే ఆర్థికంగా ఆత్మహత్య చేసుకోవడమేనని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.









