ఎస్‌ఐహెచ్‌ఎంకు పూర్వ వైభవం తీసుకువస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

  • జహీరాబాద్‌లో ఘనంగా పర్యాటక వారోత్సవాలు
  • బేకరీ కోర్సులు, నిథమ్ లో బీబీఏ, ఎంబీఏ అడ్మిషన్ల ప్రారంభం
  • పేద విద్యార్థులకు స్టైఫండ్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి

సంగారెడ్డి జహీరాబాద్‌లోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఐహెచ్‌ఎం) సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎస్‌ఐహెచ్‌ఎంలో ఘనంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులను మంత్రి ప్రారంభించారు. వీటితో పాటు నిథమ్ (NITHM) విద్యా సంవత్సరానికి సంబంధించిన బీబీఏ, ఎంబీఏ కోర్సుల అడ్మిషన్లను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు, పర్యాటక శాఖ రూపొందించిన ‘టూరిస్ట్ గైడ్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

గ్రామీణ యువతకు స్వయం ఉపాధే ధ్యేయం

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా నిరుపయోగంగా ఉన్న ఎస్‌ఐహెచ్‌ఎంను పునః ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ఎస్‌ఐహెచ్‌ఎంలో చేరిన పేద విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, వారికి స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన ఈ యుగంలో, ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. యువత ఈ అవకాశాలను అందుకోవడానికి పర్యాటక, ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

విద్యార్థులు కేవలం కోర్సులకే పరిమితం కాకుండా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్‌లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులను కరిక్యులమ్‌లో చేర్చాలని నిథమ్ డైరెక్టర్ వెంకటరమణను మంత్రి ఆదేశించారు. పిల్లల ఉపాధి కోర్సుల విషయంలో తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పర్యాటక శాఖ
స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నిథమ్ డైరెక్టర్ వెంకట రమణ, మాజీమంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ లు,తదితర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు