తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నూతన చైర్మన్ వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

హైదరాబాద్:-
భాగ్య నగర్ బ్రాహ్మణ సొసైటీ అధ్యక్షురాలు భవాని, కార్యదర్శి పి.ఎస్.ఎస్.వి ప్రసాద్ (వైష్ణవి ప్రసాద్) ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పాన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌లకు కొత్తపేట్ మారుతి నగర్‌లోని భాగ్య నగర్ తెలంగాణ బ్రాహ్మణ సమాజ్ భవన్‌లో ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, తమను ఈ పదవికి నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ నిధులు, భవనాల అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.అలాగే, శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి, అక్కడి నిర్వహణ విధానాలను పరిశీలించి తెలంగాణలో కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు.బ్రాహ్మణ సంఘాల నాయకులు, పెద్దలను కలుపుకుని అందరికీ ఉపయోగపడేలా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.వైస్ చైర్మన్ పాన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్ మాట్లాడుతూ, పేద బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవడం తమ బాధ్యత అని అన్నారు.భాగ్య నగర్ బ్రాహ్మణ సొసైటీ కార్యదర్శి పి.ఎస్.ఎస్.వి ప్రసాద్ (వైష్ణవి ప్రసాద్) మాట్లాడుతూ, బ్రాహ్మణ సమాజం బసవరాజు శ్రీనివాస్, పాన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌లకు పూర్తి మద్దతుగా ఉంటుందని, వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగరంలోని వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు