భారతదేశంలో వేగంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులపై ప్రజలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని రాజనాల శ్రీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, దిగుమతుల భారం, విదేశీ మారక నిల్వలపై ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ ఖర్చు విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
అవసరం లేని పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని, వ్యక్తిగతంగా కూడా ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. అలాగే విలాసవంతమైన, అవసరం లేని వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండి, అవసరమైన వాటినే కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రతి పౌరుడు చిన్న చిన్న మార్పులతో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడవచ్చని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఇంధన పొదుపు పాటించడం, అనవసర ఖర్చులను నియంత్రించడం వంటి చర్యలు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రాజనాల శ్రీ పేర్కొన్నారు.









