తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో కీలక సమీక్ష నిర్వహించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సజావుగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ వ్యవహారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత జిల్లా కలెక్టర్లపై కఠిన చర్యలు తప్పవని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా చూడాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం, మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర కచ్చితంగా దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. దళారులు, మిల్లర్ల ప్రమేయంతో రైతులు మోసపోకుండా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే తూకం వేసిన వెంటనే కొనుగోలు చేసిన పంటను సురక్షిత ప్రాంతాలకు, గోదాములకు లేదా రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను (లారీలు, ట్రాక్టర్లు) సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ధాన్యం కొనుగోళ్లలో తూకాల్లో మోసాలు జరిగినా, తేమ శాతం పేరుతో కోతలు విధించినా, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంలో జాప్యం జరిగినా ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదన్నారు. కింది స్థాయి అధికారుల వైఫల్యం ఉన్నప్పటికీ దానికి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్లదే అవుతుందని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి పరిష్కరించాలని, లేనిపక్షంలో కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.









