బండి భగీరథ్‌ పోక్సో కేసు: సీఎం రేవంత్ రెడ్డికి ప్రకాష్ రాజ్ సూటి ప్రశ్న!

బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ పరిణామంపై తాజాగా ప్రముఖ నటుడు, సామాజిక విశ్లేషకుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఎప్పటికప్పుడు సమకాలీన రాజకీయాలపై ‘జస్ట్ ఆస్కింగ్’ (Just Asking) పేరిట సోషల్ మీడియా వేదికగా నిలదీసే ఆయన.. తాజాగా భగీరథ్ కేసు విషయంలో నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ కీలకమైన ట్వీట్ చేశారు.

ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా లేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రకాష్ రాజ్ సూటిగా ప్రశ్నించారు. “నిందితుడు ఒక పలుకుబడి గల రాజకీయ నాయకుడి కుమారుడు అయినప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతుందా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగారుస్తారా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చిన్నారులు, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాల చిత్తశుద్ధి కేవలం మాటలకే పరిమితం కాకూడదని, చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపిస్తూ.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన తన ట్వీట్‌లో డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారడంతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక పక్క కీలక నేత కొడుకుపై తీవ్రమైన కేసు నమోదు కావడం, మరోపక్క దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే తీరుపై సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రకాష్ రాజ్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే నిలదీయడంతో.. ఈ కేసు విచారణను తెలంగాణ పోలీసులు ఎంత నిష్పాక్షికంగా చేపడతారు, ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు