TG 5,సంగారెడ్డి ప్రతినిధి, మే 11:-
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండటం ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకముందే వాటిని పరిశీలించి వెంటనే మూసివేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. అలాగే ఆర్ అండ్ బి రోడ్ల డివైడర్లపై ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పాత ఫ్లెక్సీలను తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.సింగూర్ డ్యాం వద్ద బారీకేడ్లు, హెచ్చరిక సైన్ బోర్డులు లేవని తన దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రమాదాలు నివారించేందుకు వెంటనే బారీకేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను 30 రోజులలోపు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లాలో డివిజన్ వారీగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 108 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. అందులో కలెక్టరేట్‌కు 23, సంగారెడ్డి డివిజన్‌కు 27, ఆందోల్ డివిజన్‌కు 03, నారాయణఖేడ్ డివిజన్‌కు 27, జహీరాబాద్ డివిజన్‌కు 29 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









