పట్టణంలోని గడితోట కాలనీలో సోమవారం మధ్యాహ్నం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి ఆరు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడితోట కాలనీకి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే రైతు సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు, ఇదే అదునుగా భావించి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో భద్రపరిచిన 6 తులాల బంగారం, రూ. 50 వేల నగదును అపహరించుకుపోయారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్, తలుపులు పగులగొట్టి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని సొమ్ము మాయం కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలను సేకరించారు. బాధితుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.









