సమాజ సమస్యలకు పరిష్కారాలే నిజమైన పరిశోధనలు : డా. రూపా వాసుదేవన్
భారతీయ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ (బీఈఎస్.టీఐయూ) పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో పరిశోధనలో సృజనాత్మకత ఆవిష్కరణ అంశంపై అంతర్జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.సదస్సును బీఈఎస్.టీఐయూ ఛాన్సలర్ డా. రూపా వాసుదేవన్, వైస్ చాన్సలర్ డా. కె. నాగజ్యోతి, సైంటిఫిక్ చైర్ డా. ఆశుతోష్ శర్మ, ముఖ్య అతిథి డా. గోపాల్ లాల్, గౌరవ అతిథి డా. వల్లీ మణికం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛాన్సలర్ డా. రూపా వాసుదేవన్ మాట్లాడుతూ, పరిశోధనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు అందించేలా ఉండాలని పేర్కొన్నారు. సృజనాత్మక ఆలోచనలు, వినూత్న పరిశోధనల ద్వారానే ప్రపంచ సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అన్నారు. వైస్ చాన్సలర్ డా. కె. నాగజ్యోతి మాట్లాడుతూ, అంతర్జాతీయ సదస్సులు శాస్త్రీయ పరస్పర వినిమయానికి ముఖ్య వేదికలని తెలిపారు. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, స్వతంత్ర పరిశోధన దృక్పథం పెంపొందించేందుకు విశ్వవిద్యాలయం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. సైంటిఫిక్ చైర్ డా. ఆశుతోష్ శర్మ మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న పరిశోధన విధానాలు, సాంకేతిక పురోగతి, సృజనాత్మక సమస్య పరిష్కారాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఉత్తమ వేదికగా నిలిచిందన్నారు. డా. గోపాల్ లాల్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఈ తరహా సదస్సులు పరిశోధన రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని అభిప్రాయపడ్డారు. సదస్సులో ప్రధాన ప్రసంగాలు, సాంకేతిక సెషన్లు, ప్యానెల్ చర్చలు, పేపర్ ప్రెజెంటేషన్లు నిర్వహించగా, పరిశోధకులు తమ వినూత్న పరిశోధన పత్రాలను సమర్పించారు. అనంతరం పేపర్ ప్రెజెంటర్లకు, పరిశోధకులకు సర్టిఫికెట్లు అందజేశారు. పరిశోధన, ఉన్నత విద్య రంగాల్లో సృజనాత్మకత మరియు ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ బీఈఎస్.టీఐయూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.









