ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన: రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మే 10, ఆదివారం) తెలంగాణలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా సుమారు ₹9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని, అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.

ఈ పర్యటనలో ముఖ్యంగా వరంగల్‌లోని ‘పీఎం మిత్ర’ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే జహీరాబాద్‌లో సుమారు 3,245 ఎకరాల్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేస్తారు. రవాణా రంగంలో భాగంగా హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మహబూబ్‌నగర్ నుండి గూడెబల్లూర్ వరకు జాతీయ రహదారి-167 విస్తరణ పనులకు పునాది రాయి వేస్తారు. వీటితో పాటు మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు.

అనంతరం హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన ‘సింధు హాస్పిటల్’ను ప్రధాని సందర్శించి, దానిని జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. పర్యటన ముగిసిన తర్వాత రాత్రి 6:45 గంటలకు ప్రధాని మోదీ హైదరాబాద్ నుండి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు బయలుదేరి వెళతారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు