TG 5, సంగారెడ్డి ప్రతినిధి
కొండాపూర్ మండలం శివన్న గూడెం తండాలోని జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు తండా ప్రజలు, యువకులు లంబాడ సంప్రదాయ వస్త్రధారణతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో లంబాడ సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా తండాలో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తన పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తండా ప్రజలు తనకు మంచి మెజార్టీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తండా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. అలాగే జగదాంబ సేవాలాల్ ఆలయ అభివృద్ధికి కూడా తన వంతు సహాయం అందిస్తానన్నారు.
జగదాంబ సేవాలాల్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దేవేందర్, మల్లేశం, వివిధ గ్రామాల సర్పంచ్లు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.









