మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం, తమ అభిమాన నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి దక్కాలని కోరుకుంటూ ఓ అభిమాని అత్యంత కఠినమైన మొక్కును తీర్చుకున్నారు. మునుగోడు నియోజకవర్గం చివరి గ్రామమైన ముష్టిపల్లికి చెందిన ముష్టిపల్లి లింగస్వామి శనివారం నాంపల్లి మండలంలోని చలి దొన లక్ష్మీనరసింహ స్వామి గుట్టపై ఈ వినూత్న పూజలు నిర్వహించారు.లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో రాజగోపాల్ రెడ్డి గారికి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని కాంక్షిస్తూ లింగస్వామి గుట్టపై ఉన్న 200 మెట్లను మోకాళ్లపైనే ఎక్కారు. ఈ కఠిన దీక్షను చూసి అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని, తద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. “మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావడం ఎంతో అవసరం. ముఖ్యంగా నియోజకవర్గ పొలిమేరలో ఉన్న మా ముష్టిపల్లి వంటి గ్రామాల సమస్యలు తీరాలంటే ఆయనకు అధికారిక హోదా దక్కాలి. నియోజకవర్గ ప్రజలందరి కోరిక కూడా ఇదే. స్వామివారి కృపతో ఇది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతున్న తరుణంలో, మునుగోడు ప్రజల ఆకాంక్షలు మరియు రాజగోపాల్ రెడ్డి గారిపై ఉన్న నమ్మకాన్ని ఈ ఘటన చాటిచెబుతోంది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రాజగోపాల్ రెడ్డి అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.









