హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో అత్యంత పాశవిక ఘటన చోటుచేసుకుంది. అల్వాల్ ప్రాంతానికి చెందిన యమన్ అనే బి.టెక్ విద్యార్థి, తాను ప్రేమించిన యువతిని కలిసేందుకు సీతాఫల్‌మండికి వెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి ఒక ఇంటి వరండాలో కూర్చుని, మొబైల్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. యువతి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని యమన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో నిందితులు యమన్‌ను ఏకంగా 17 చోట్ల కత్తులతో పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో యమన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్ల ముందే జరిగిన ఈ దారుణ హత్యతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి లోతైన విచారణ కొనసాగుతోంది.








