TG 5,సంగారెడ్డి ప్రతినిధి, మే 07:-
ప్రస్తుత మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులు డిమాండ్ ఉన్న, లాభదాయకమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ, విద్యుత్, రెడ్‌కో శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడులతో పాటు మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవసరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు అవగాహన పెంపొందించుకుని పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలని సూచించారు.
వ్యవసాయంలో పంటల సాగుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా రైతులు దృష్టి పెట్టాలని చెప్పారు. వ్యవసాయంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పీఎం కుసుమ్ కాంపోనెంట్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని రైతులు నిరంతర ఆదాయం పొందేలా ముందుకు రావాలని సూచించారు. సహజ వనరులను సమర్థంగా వినియోగించుకునే దిశగా రైతులు అడుగులు వేయాలన్నారు.అదేవిధంగా ఆయిల్ పామ్ సాగు మంచి లాభదాయకమైన పంట అని, భూమి, బోరు సౌకర్యం ఉంటే సరిపోతుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నందున రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పలు వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా కొంతమంది రైతులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఏ పంటలు సాగు చేస్తున్నారని, ఎన్ని ఎకరాలు ఉంది, బోరు సౌకర్యం ఉందా అని ఆరా తీశారు. ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు రైతు తెలుపగా, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
జహీరాబాద్, సదాశివపేట, వట్‌పల్లి ప్రాంతాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొందరు రైతులు కోరగా, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అనంతరం రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న డ్రోన్లు, కట్టర్లు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రెడ్‌కో, వ్యవసాయ శాఖ అధికారులు పీఎం కుసుమ్ కాంపోనెంట్ పథకం గురించి , ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్, రెడ్‌కో, వ్యవసాయ శాఖ అధికారులు, ఏవోలు, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.









