ఇటీవల గ్రామాలు, పట్టణాల్లో “ప్రైవేట్ పంచాయతీ”ల పేరుతో అక్రమ దందాలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, ఆస్తి తగాదాలు, అప్పు వ్యవహారాలు, భూ సమస్యలు వంటి ఏ చిన్న సమస్య వచ్చినా కొందరు వ్యక్తులు “మేమే పరిష్కారం చూపిస్తాం” అంటూ మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ బాధితులను మోసం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యేకంగా “పెద్దమనుషుల పంచాయతీ” పేరుతో సమస్యలను పరిష్కరించడానికి సమావేశాలు ఏర్పాటు చేసి, బాధితుల నుంచి భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. మొదట “సమస్య త్వరగా పరిష్కరిస్తాం” అని నమ్మకం కల్పించినా, తర్వాత పంచాయతీని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తూ “పెద్దమనుషుల ఖర్చులు”, “సెట్టిల్మెంట్ ఖర్చులు”, “మధ్యవర్తిత్వ ఖర్చులు” అంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో సమస్యలను పరిష్కరించకుండా మరింత క్లిష్టంగా మార్చి, రెండు వర్గాల మధ్య విభేదాలను పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. చట్టపరమైన అవగాహన లేని సాధారణ ప్రజలు వీరి మాటలు నమ్మి ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పేద కుటుంబాలు ఈ ప్రైవేట్ పంచాయతీల బారిన ఎక్కువగా పడుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.
ఇలాంటి అక్రమ సెటిల్మెంట్ దందాల వల్ల అసలు సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో పాటు ప్రజల్లో పోలీస్, న్యాయ వ్యవస్థలపై కూడా అనుమానాలు పెరిగే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. చట్టపరంగా పరిష్కరించాల్సిన అంశాలను కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం తమ చేతుల్లోకి తీసుకుని ప్రజలను దోచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ పంచాయతీల పేరుతో అక్రమంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కుటుంబ, ఆస్తి, భూ వివాదాల వంటి అంశాలను కేవలం పోలీస్, రెవెన్యూ, న్యాయ వ్యవస్థల సమక్షంలోనే పరిష్కరించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలను మోసం చేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ సెటిల్మెంట్ ముఠాలను అరికట్టేందుకు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయాలని, బాధితులకు న్యాయ సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా చేస్తేనే ప్రజల్లో లా అండ్ ఆర్డర్ వ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుందని, సామాన్యులకు నిజమైన న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









