ఖాకీకి అవినీతి మకిలి.. ఏసీబీ వలలో బోధన్ ఎస్సై
నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ చిత్తన్నొజు భాస్కర చారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. ఒక క్రిమినల్ కేసులో ఫిర్యాదుదారుడి బంధువు పేరును కేసులో చేర్చకుండా ఉండేందుకు మొదట రూ.10,000 లంచం డిమాండ్ చేసిన ఎస్సై, చివరకు రూ.7,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
బుధవారం పోలీస్ స్టేషన్‌లోనే లంచం నగదును స్వీకరిస్తుండగా ముందుగానే వల పన్నిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రసాయనంతో గుర్తించిన నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఎస్సైను అదుపులోకి తీసుకున్న అధికారులు, హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. రక్షక భటుడే భక్షకుడిగా మారిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.









