జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని సహాయ కోశాధికారి కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడుతోంది. ఉదయం 11:30 గంటలు అయినప్పటికీ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం గమనార్హం. కార్యాలయానికి పనిమీద వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
అదేవిధంగా, కార్యాలయంలో ఎవరూ లేకపోయినా ఫ్యాన్లు తిరుగుతుండటం, లైట్లు వెలుగుతుండటం వల్ల ప్రజాధనం విద్యుత్ రూపంలో వృథా అవుతోంది. ఈ పరిస్థితిపై అక్కడికి వచ్చిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల వాదన ప్రకారం, ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సమయానికి రావడం అరుదు. ఒకవేళ వచ్చినా తమ వ్యక్తిగత పనుల నిమిత్తం ఎప్పుడైనా బయటకు వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ సేవలు పొందడానికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
— సిహెచ్ ప్రసాద్
స్టేషన్ ఘనపూర్, జనగామ జిల్లా









