TG 5,సంగారెడ్డి ప్రతినిధి జిల్లాలో నేటి నుండి ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆయా డివిజన్ పరిధిలోని ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను ఆయా వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజావాణితో పాటు ఆందోల్, సంగారెడ్డి డివిజన్లకు సంబంధించిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్ కేంద్రాలలోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయాలలో ప్రతి సోమవారం డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుపుతుందని తెలిపారు.
డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి హాజరై తమ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే, డివిజనల్ స్థాయి అధికారులందరూ తమ తమ డివిజన్లలో తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరై, అందిన ఫిర్యాదులను సకాలంలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత 30 రోజులలోపు పరిష్కరించాలని, ఏవైనా కారణాల వల్ల ఆలస్యం అయితే వాటిని స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో డివిజన్ వారిగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై
మొత్తం(134) ఫిర్యాదులు అందాయని, అందులో
కలెక్టరేట్ కు 57 ఫిర్యాదులు , సంగారెడ్డి డివిజన్ కు 29, ఆందోల్ కు 02, నారాయణఖేడ్ కు 24, జహీరాబాద్ ప్రజావాణికి 22 ఫిర్యాదులు అందినట్లు
సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, జిల్లా అధికారులు, సంగారెడ్డి, ఆందోల్ డివిజన్ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.









