నల్లగొండ, రిపోర్టర్ – నవీన్ కుమార్.Ch
నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. క్రైమ్ నెంబర్ 62/2018, ఎస్సీ పోక్సో నెంబర్ 37/2019 కింద నమోదైన ఈ కేసును నల్గొండలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు (రేప్ మరియు పోక్సో కేసులు) గౌరవ న్యాయమూర్తి విచారించి తీర్పు వెలువరించారు.
ఈ కేసులో నిందితుడు పల్లపు దుర్గ ప్రసాద్ (26), గుంటూరు జిల్లా మాచర్లకు చెందినవాడు. రెండో వివాహం చేసుకున్న భార్య కూతురిపై లైంగిక దాడికి యత్నించిన ఘటనపై బాధిత బాలిక ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తు సమయంలో సేకరించిన పటిష్టమైన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడు చేసిన నేరాలు రుజువుకావడంతో కోర్టు ఐపీసీ సెక్షన్ 506 కింద 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 2 నెలల సాధారణ కారాగార శిక్ష విధించబడుతుంది.
అదేవిధంగా, పోక్సో చట్టం సెక్షన్ 9(n) చదివి సెక్షన్ 10 కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో 3 నెలల సాధారణ కారాగార శిక్ష విధించబడుతుంది.
కోర్టు ఆదేశాల ప్రకారం, పై రెండు శిక్షలు సమాంతరంగా (కంకరెంట్‌గా) అమలులో ఉంటాయి.
ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ సమర్థంగా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తును నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు అప్పటి ఎస్.ఐలు కె. గోవర్ధన్, డి. విజయ్ కుమార్ నిర్వహించగా, ప్రస్తుత నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, ఎస్.ఐ పి. విష్ణు మూర్తి, కోర్టు డ్యూటీ అధికారులు డి. కిరణ్ కుమార్, పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్ నిష్పక్షపాతంగా పనిచేశారు.
బాధిత బాలికకు న్యాయం జరిగేలా కృషి చేసిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.









