రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతుల భూముల సమస్యలపై మంత్రికి వినతి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, స్థల సమస్యలు, నిధుల అవసరాలపై ఎమ్మెల్యే చర్చించారు. ఎమ్మెల్యే కోటా కింద కేటాయించాల్సిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతోందని తెలిపారు. 40 శాతం కేటాయింపులు ఉంటాయని చెప్పినప్పటికీ, ఇందిరమ్మ కమిటీ ప్రమేయం లేకుండా , ఇళ్ల మంజూరు జరుగుతోందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా వెంటనే ఇళ్ల కేటాయింపులు జరిగేలా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల రైతుల నుంచి TGIIC భూములు సేకరిస్తోందని తెలిపారు. కనీస సౌకర్యాలు, అత్యవసర అవసరాలు, శ్మశాన వాటికల కోసం కూడా స్థలం లేకుండా మొత్తం భూములను TGIICకి అప్పగిస్తే భవిష్యత్తులో గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. గ్రామాల మౌలిక వసతుల కోసం తగిన స్థలం కేటాయించాలని కోరారు.

అదేవిధంగా గతంలో మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. వాటి నిర్మాణానికి నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేసి అర్హులకు కేటాయించాలని కోరారు. అక్రమంగా , అనర్హులుగా ఆక్రమించి నివసిస్తున్న వారిని తొలగించి, నిజమైన అర్హులకు ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

ల్యాండ్ పూలింగ్ కింద కంది, ఆరుట్ల, పసల్వాది, ఇంద్రకరణ్ గ్రామాల్లో HMDA భూములు స్వాధీనం చేసుకుందని తెలిపారు. రైతులకు ఎకరానికి 600 గజాలు అభివృద్ధి చేసి ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి ప్రయోజనాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. వెంటనే రైతులకు భూములు ఇవ్వాలని, లేదంటే అభివృద్ధి చేసి కేటాయించాలని కోరారు.

సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 476లో 68 ఎకరాల భూమిపై కూడా ఎమ్మెల్యే సమస్యను వివరించారు. ఆ భూమిపై నర్సరీలు నిర్వహిస్తూ రైతులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. 2012లో భూ స్వాధీనం సమయంలో రైతులు జీవనాధారం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేయగా, ఆ ఘటనలో భూమమ్మ అనే మహిళ మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా రైతులకు అన్యాయం జరుగుతోందని, అదనంగా మరికొంత భూమి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు.

సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామ రైతుల భూముల సమస్యపై కూడా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలియాబాద్ గ్రామంలోని సర్వే నంబర్లు 3, 4, 83-89, 101-103 పరిధిలో సుమారు 44 ఎకరాల భూములు దాదాపు 40 మంది రైతుల ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. అయితే ఈ భూములు పొరపాటున వక్ఫ్ బోర్డు రికార్డుల్లో నమోదు కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

రైతుల వద్ద చట్టబద్ధమైన పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర భూ పత్రాలు ఉన్నాయని, రైతుబంధు, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాల లబ్ధులు కూడా పొందుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వక్ఫ్ బోర్డు రికార్డుల నుంచి ఈ భూములను తొలగించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి ని కోరారు.

రైతుల హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు