రోడ్డుపై చెల్లాచెదురైన ధాన్యాన్ని సేకరించి రైతుకు సహాయం చేసిన ట్రాఫిక్ పోలీసు సిబ్బంది.
ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రం అండర్ బ్రిడ్జి వద్ద రోడ్డుపై ఓ రైతు తీసుకెళ్తున్న ధాన్యం బస్తా ప్రమాదవశాత్తూ జారి రోడ్డుపై చెల్లాచెదురైంది. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కాన్స్టేబుల్ భాస్కర్, పాపాలల్, హోమ్ గార్డ్ ఆఫీసర్ వెంకన్న పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు.
రోడ్డుపై పడిన ధాన్యాన్ని వృథా కాకుండా జాగ్రత్తగా సేకరించి తిరిగి బస్తాలలో నింపి రైతుకు అందజేశారు. అంతేకాకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను నియంత్రిస్తూ, రోడ్డును శుభ్రపరచి సజావుగా రాకపోకలు సాగేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా రైతు భూక్యా బాలాజీ ట్రాఫిక్ పోలీసుల సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, సరుకు రవాణా సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.









