హైదరాబాద్‌లోని అంబర్‌పేట చే నెంబర్ చౌరస్తాలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి రెనాల్ట్ మరియు మహీంద్రా కార్ల షోరూమ్‌లలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాద ధాటికి షోరూమ్‌లలో ఉన్న కొత్త కార్లు, విడిభాగాలు అగ్నికి ఆహుతవుతున్నాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు ఐదుకు పైగా ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షోరూమ్‌లలో కెమికల్స్, ఆయిల్స్ ఉండటంతో మంటలు త్వరగా వ్యాపిస్తున్నాయని, వాటిని నియంత్రించడం సవాలుగా మారిందని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లించి, ప్రజలను అప్రమత్తం చేశారు.
ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు, అయితే కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మంటలను పూర్తిగా ఆర్పివేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని యంత్రాంగం పేర్కొంది.









