TG 5,సంగారెడ్డి ప్రతినిధి
పిల్లల చదువు పై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్నప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి లో గల మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల జోగిపేట (బాలికలు)లో గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తమ సూచనలు, సలహాలు అందించాలని, సమస్యలు ఉన్నపక్షంలో వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అవసరమైతే కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసి, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమస్యలను స్వీకరించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం పెంపొందించేందుకు హాస్టల్లో ప్రతిరోజు ఒక గంటపాటు ఇంగ్లీష్‌లోనే మాట్లాడే విధానాన్ని అమలు చేయాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులకు ఆదేశించారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి, వారు బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు, ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు.
ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తోందని, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వసతి గృహాలలో అందిస్తున్న సౌకర్యాలపై కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రతి నెల నిర్వహించే పేరెంట్స్ మీటింగ్‌కు తల్లిదండ్రులు హాజరై, పిల్లలతో కలిసి ఒక పూట భోజనం చేసేలా అన్ని వసతి గృహాలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులలో పెరుగుతున్న మానసిక, భావోద్వేగ సమస్యలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి వారికి మానసిక ధైర్యం అందించాలని సూచించారు.
విద్యార్థులు తమ ఆసక్తి ఉన్న సబ్జెక్టులను ఎంపిక చేసుకుని, తమ ప్రతిభను మెరుగుపరుచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచి, సంక్షేమ వసతి గృహాలలో అందుతున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం 2025-26 విద్యాసంవత్సరంలో 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ప్రిన్సిపాల్ రజని, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ స్రవంతి, డిప్యూటీ వార్డెన్ జ్యోతి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









