శాంతియుతంగా సమ్మె నిర్వహించాలి, చట్టం అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

జిల్లా పోలీసు కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా

పత్రిక ప్రకట తేది: 22.04.2026

• సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను శాంతియుతంగా నిర్వహించుకోవాలి.
• బస్సులు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తే సహించేది లేదు.అట్టి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు..
• చట్టానికి లోబడి నడుచుకోవాలి.. : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.

TG5,సంగారెడ్డి ప్రతినిధి:

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సమ్మె పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని, కార్మికులు తమ వినతులను సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేయాలే కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అన్నారు.

సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మరియు అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మరియు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి విధుల్లో చేరినా, వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు నడపడానికి అర్హత కలిగిన డ్రైవర్లు ముందుకు రావాలని సూచించారు. ఆసక్తి ఉన్న డ్రైవర్లు జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా, అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సులు మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసి సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ చట్టానికి లోబడి వ్యవహరించాలని సూచించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కూడా జిల్లా పోలీసు కార్యాలయం నుండి పర్యవేక్షణ కొనసాగుతోందని, అట్టి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమ్మెలో పాల్గొనే కార్మికులు మరియు ప్రజలు పరస్పర గౌరవంతో వ్యవహరించి, ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు