TG 5,సంగారెడ్డి ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రంగా హర్షించారు. న్యాయస్థానంలో అంతిమంగా సత్యం, ధర్మమే గెలిచాయంటూ పార్టీ అధినేత కేసీఆర్ గారికి, మాజీ మంత్రి హరీశ్ రావు గారికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సత్యం, ధర్మం పక్షాన నిలిచింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రైతాంగానికి దక్కిన నైతిక విజయం. తెలంగాణ జలప్రదాత కేసీఆర్ కి, ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన మాజీ మంత్రి హరీశ్ రావు కి నా ప్రత్యేక శుభాకాంక్షలు.
కేవలం రాజకీయ కక్షసాధింపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ వ్యాఖ్యలు చెల్లవని కోర్టు తేల్చిచెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి సాగించిన విచారణ కేవలం రాజకీయ డ్రామా అని స్పష్టమైంది.
కేవలం రెండు పిల్లర్లకు చిన్న రిపేర్లు చేస్తే సరిపోయే దానికి.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం, రాజకీయ కుట్రలు ఈ తీర్పుతో ప్రజల ముందు బట్టబయలయ్యాయి.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరమే. కేసీఆర్ గారి అద్భుత సృష్టిని, కేసీఆర్ గారి కష్టాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూసిన కాంగ్రెస్ నాయకులకు హైకోర్టు తీర్పుతోనైనా జ్ఞానోదయం కావాలి.
హైకోర్టు తీర్పు తర్వాత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలి. ఇకనైనా ఈ కక్షసాధింపులు, రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి.. వెంటనే ఆ పిల్లర్లకు మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలి.









