పత్రికా ప్రకటన
తేది: 22.04.2026
వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
చోరీలు, పిల్లల ఈత ప్రమాదాలపై మట్వాడ పోలీస్ స్టేషన్, వరంగల్ సిటీ పోలీసుల సూచనలు
వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు లేదా విహారయాత్రలకు వెళ్తున్న సమయంలో చోరీలు జరిగే అవకాశాలు ఉన్నాయని మట్వాడ పోలీస్ స్టేషన్, వరంగల్ సిటీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంటిని ఖాళీగా వదిలి వెళ్లే వారు నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని మొబైల్కు అనుసంధానం చేసుకోవడం ద్వారా ఇంటి పై నిఘా ఉంచవచ్చన్నారు. నమ్మకమైన పొరుగువారికి లేదా బంధువులకు ప్రయాణ వివరాలు తెలియజేసి, ఇంటిని పర్యవేక్షించమని కోరడం మంచిదని తెలిపారు.
ఇంటి బయట రాత్రి సమయంలో లైట్లు వెలిగేలా ఆటోమేటిక్ టైమర్లు అమర్చుకోవడం, పోస్టులు లేదా పార్శిల్స్ పేరుకుపోకుండా చర్యలు తీసుకోవడం ద్వారా ఇంట్లో ఎవరూ లేరనే అనుమానం రాకుండా చూడవచ్చని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అదేవిధంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పిల్లలు చెరువులు, కుంటలు, కాలువల వద్ద ఈత కొట్టేందుకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలియని నీటిలో ఈత కొట్టడం ప్రమాదకరమని, పిల్లలను ఒంటరిగా నీటి వనరుల వద్దకు పంపకూడదని, ఎల్లప్పుడూ పెద్దల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు.
ప్రజల భద్రత కోసం పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి ఈ సూచనలు పాటిస్తే చోరీలు మరియు ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు పేర్కొన్నారు.









