హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎగ్జిట్ నంబర్ 16 వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళలు ఉండటం చూసేవారిని కలిచివేసింది.
ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, వేగంగా దూసుకొచ్చిన కారు లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయింది. దీంతో మృతదేహాలు కారు శిథిలాల మధ్య ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో అతికష్టం మీద మృతదేహాలను బయటకు వెలికితీశారు. కారులో మొత్తం ఏడుగురు ఉండగా.. వారిలో ఆరుగురు చనిపోగా, ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ప్రాథమిక విచారణ ప్రకారం, మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. లారీని ఢీకొట్టిన ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతుల వివరాలను సేకరిస్తున్నారు. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.









